రాక్షసులు, దేవతల యజ్ఞాన్ని అడ్డుకుంటున్నట్లు అడ్డుపడుతున్నారు
తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ అభివృద్ధి పనులను రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని మచలీపట్నం సభలో వ్యాఖ్యానించారు ఏపీ సీఎం జగన్. పేదలకు 50 వేలమందికి ఇళ్ల స్థలం ప్రభుత్వం పంచి పెడతానంటే టీడీపీ వారికి బాధగా ఉందన్నారు. వారికి తోడు వారి దత్తపుత్రుడు కూడా తోడయ్యాడన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేదకు కూడా ఇళ్లు ఇవ్వలేదన్నారు. పైగా తాను ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని విమర్శించారు. పేదలకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్న రాక్షసులతో తాను యుద్ధం చేస్తున్నానన్నారు. పేదలంటే చంద్రబాబుకు చులకన ఉందన్నారు. నయా అంటరానితనానికి, పెత్తందారుల మనస్తత్వానికి ప్రతీకగా చంద్రబాబు నిలిచారన్నారు. అమరావతిలోని ఒకటిన్నర సెంటుభూమిని పేదలకు అందజేస్తుంటే సమాధికి కూడా సరిపోదని చంద్రబాబు వ్యాఖ్యానించారని మండిపడ్డారు. టీడీపీకి తోడు గజదొంగల ముఠా మీడియా చానెల్స్‌తో కలిసి రాష్ట్రాన్ని దోచుకుందామని ప్లాన్ చేశారన్నారు. అమరావతిలో పేదలకు సంబంధం లేని రాజధానిని ఏర్పాటు చేయాలని, గేటెడ్ కమ్యూనిటీని నిర్మించాలని వారి ప్లానింగ్ అన్నారు. పేదలు అక్కడ కేవలం పనివారుగా మాత్రమే మిగలాలని బాబు ప్లాన్ అన్నారు. అందుకే తాను పేదలకు అమరావతిలో ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ భూముల పంపిణీ చేస్తున్నానన్నారు. వారి వికృత ఆలోచనను కొనసాగనివ్వమని, పేదల తలరాతను మార్చాలనే సంకల్పం చేశానన్నారు.

