కేంద్రానికి డిమాండ్ల మీద డిమాండ్లు
తెలంగాణ రాష్ట్రానికి పీఎం కుసుమ్ పథకం కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని కేంద్ర ఆహార పౌర సరఫరాలు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గతంలో 4 వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, తర్వాత దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలాల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర మంత్రికి వివరించి, గతంలో మంజూరు చేసిన 4 వేల మెగావాట్ల ఉత్పత్తి అనుమతులను పునరుద్ధరించాలని కోరారు.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మే 2021 నుంచి మార్చి 2022 వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకుని అందుకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని కోరారు.