చైనాలో కన్యాశుల్కంపై ఆంక్షలు
చైనాలో కూడా వధువుకు కన్యాశుల్కం ఇచ్చే ఆచారం ఉంది. దీనిని కైలీ అనే పేరుతో పిలుస్తారు. జనాభా తగ్గిపోతూండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జననాలు పెంచాలనే ఉద్దేశ్యంతో ఇలా పెళ్లి సమయంలో వధువుకు సొమ్ము ముట్టజెప్పే ఈ కైలీ సంప్రదాయంపై ఆంక్షలు విధించింది. చైనాలో వధువులు తగ్గిపోతూండడంతో వారికి డిమాండ్ బాగా పెరిగింది. దీనితో బ్రహ్మచారులు దేశంలో పెరిగిపోతున్నారు. వధువు కుటుంబం అడిగే కైలీని ఇవ్వలేక పెళ్లిళ్లు బాగా ఖరీదైన వ్యవహారంగా మారిపోతున్నాయి. దాదాపు వరుడు కుటుంబపు వార్షిక ఆదాయానికి కొన్ని రెట్లు వధువు కుటుంబానికి ఇవ్వాల్సి వస్తోంది.

ఎప్పటి నుండో ఈ సంప్రదాయాన్ని అడ్డుకోవడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనివల్ల కైలీ విధానం అమలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కొన్ని నగరాలలో కైలీ అడగబోమని యువతుల చేత ప్రతిజ్ఞలు చేయించారు. సామూహిక వివాహాలను ప్రోత్సహించడం, ఎక్కువ సంతానం కన్నవారికి సబ్సిడీలు ఇవ్వడం, పెళ్లిళ్లకు కావల్సినన్ని సెలవులు మంజూరు చేయడం వంటి చర్యలు చేపట్టింది. అంతేకాదు, వివాహాలు కాని జంటలు కూడా తమ సంతానాన్ని రిజిష్టర్ చేసుకునే సదుపాయం కల్పించారు. మరోవైపు చైనాలో కొన్ని ప్రదేశాలలో వరకట్నం కూడా ఉంది. కానీ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. గత సంవత్సర కాలంలో దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిపోయిందని అక్కడి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.