రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి, ఎంపీ, శివసేన ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వాళ్లు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్, క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సెంట్రల్ యూనియన్ మినిస్టర్ రవనీత్ బిట్టు ఒక ప్రతిపక్ష నేతను పట్టుకుని టెర్రరిస్ట్‌గా అభివర్ణించడం తగదని అన్నారు. అహంకార పూరితంగా మాట్లాడడం సరికాదన్నారు. రాహుల్‌గాంధీ నాలుక కోసి తీసుకొస్తే నగదు బహుమతులు ఇస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బొందె, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ప్రధానమంత్రి తర్వాత ఆ హోదా కలిగిన వ్యక్తిని కించపర్చుతూ వ్యాఖ్యలు చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇంకొ బీజేపీ నేత మాట్లాడుతూ..నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీకి పట్టిన గతే రాహుల్‌గాంధీకి పడుతుందని నిస్సుగ్గుగా మాట్లాడడం హేయనీయమన్నారు. ఇలాంటి నేతలతో బీజేపీ మరింత అప్రతిష్టపాలవుతోందని దుయ్యబట్టారు.

మూర్ఖత్వంగా, అహంకార పూరితంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశ స్వాతంత్రోద్యమంలో అసలు బీజేపీ పాత్రే లేదని మండిపడ్డారు. స్వాతంత్రం పోరాటంలో బీజేపీ నేతలెవరైనా ప్రాణాలు అర్పించారా అని ప్రశ్నించారు. మత విద్వేశాలు సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకునేవారు దేశ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. అనుచిత వ్యాఖ్యలు చేసినవారిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఉద్యమిస్తామని తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోడీ చర్యలు చేపట్టకపోతే వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టేనని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నిరసన నినాదాలతో హోరెత్తించారు.