Home Page SliderNational

రాహుల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు… లైంగిక వేధింపులకు గురైన వారి వివరాలు ఇవ్వండి

‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు. “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు” అంటూ రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులకు సంబంధించి తనను సంప్రదించిన మహిళల వివరాలను కోరుతూ పోలీసులు మార్చి 16న రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌లను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు రాహుల్ గాంధీకి ఇందుకు సంబంధించి ప్రశ్నావళి సైతం పంపించారు. ఐతే దీనిపై రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పందించలేదు.

భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ ‘మహిళలపై ఇప్పటికీ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని నేను విన్నాను’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఐతే రాహుల్ గాంధీ దృష్టికి వచ్చిన మహిళల వివరాలను చెప్పాలని ఢిల్లీ పోలీసులు కోరారు. అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోడానికి వీలుకలుగుతుందని చెప్పారు. సంబంధిత మహిళలకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు గాంధీతో మాట్లాడేందుకు ప్రత్యేక పోలీసు కమిషనర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా రాజకీయ కక్షలో భాగమంటూ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. బాధితుల పేర్లు చెప్పాలని బలవంతం చేయడం దారుణమని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.

courtesy ani

మహిళలు లైంగిక వేధింపుల విషయంలో ప్రకటన ఉంటుందని… బాధితుల పేర్లను వెల్లడించమని రాహుల్ గాంధీని బలవంతం చేయలేరని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసుల చర్య హానికరమైనదని దుయ్యబట్టారు. అయితే మహిళల పేర్లు ఇవ్వకుంటే… మరోసారి నోటీసులివ్వాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. మొత్తం వ్యవహారం వ్యక్తుల జీవితాలు, భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలని… సాక్ష్యాలు, సాక్షులు విషయంలో ఎంతో జాగ్రత్త అవసరమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. భారత్ జోడో యాత్ర ముగిసి 45 రోజులయ్యిందని.. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు విచారణకు వెళ్తున్నారన్నారు మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్. రాహుల్ వ్యాఖ్యలపై ఇంత ఆందోళన ఉంటే, ఫిబ్రవరిలో ఎందుకు వాచిరించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ లీగల్ టీమ్ దీనిపై చట్ట ప్రకారం స్పందిస్తుందన్నారు జైరాం రమేష్.