ఢిల్లీ వరాలు…. అబ్బో…అబ్బో…అబ్బబ్బో !
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో సంకల్ప పత్రా – 1 పేరుతో బీజెపి శుక్రవారం మేనిఫెస్టో విడుదల చేసింది.ఆ వరాల జల్లులు చూస్తే ఎవరైనా సరే తడిసి ముద్దవ్వాల్సిందే అన్నట్లుగా మేనిఫెస్టోని ప్రకటించింది బీజెపి.గర్భిణీ స్త్రీలకు రూ.21 వేలు,అదేవిధంగా 6 పౌష్టికాహార కిట్ల పంపిణీ, బాలింతలకు ఇప్పుడిస్తున్న రూ.5వేలు పెంపు, ప్రతీ పండగకు ఓ ఉచిత గ్యాస్ సిలిండర్, ప్రతీ వ్యక్తికి రూ.5లక్షల ప్రమాద బీమా,మహిళా సమృద్ధి యోజన కింద ప్రతీ నెల రూ.2500లు, 60 నుంచి 70 ఏళ్ల వయస్కులైన వారి పెన్షన్ ను రూ.2000 నుంచి రూ.2500లకు పెంపు, ఆపైబడిన వయో వృద్ధులు,వితంతువులకు ఇప్పుడిస్తున్న రూ.2500లను రూ.3000లకు పెంచుట….ఇలా అనేక హామీలను గుప్పించింది. బీజెపి ఇలా ప్రకటించిందో లేదో… ఇవన్నీ ఇస్తానన్నది బీజెపియేనా అంటూ దేశంలోని సెక్యులరిస్టులంతా సోషల్ మీడియా వేదిక సెటైర్లు వినిపిస్తున్నారు.బీజెపియేతర రాష్ట్రాల్లో పథకాల వల్లే ఖజానా దెబ్బతింటుందని, సంపద ఆవిరైపోతుందని గగ్గోలు పెట్టే కాషాయ దండు…ఇప్పుడు హస్తినలో అలవిమాలిన హామీలు ఎలా ఇస్తానంటున్నారబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.