బ్రిటన్ ఎన్నికలలో పరాజయం..రిషి సునాక్ ఏమన్నారంటే
బ్రిటన్ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని రిషి సునాక్ నాయకత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ పరాజయం పాలయ్యింది. దీనితో రిషిసునాక్ ఈ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఎన్నికలలో విజయం సాధించిన లేబర్ పార్టీని, పార్టీ నేత కీర్ స్టార్మర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. అధికారం శాంతియుతంగానే చేతులు మారుతుందని, దేశభవిష్యత్తుపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని తెలియజేశారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో 650 స్థానాలలో ఈ ఎన్నికలు జరిగాయి. అధికారం రావాలంటే 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. కానీ కన్జర్వేటివ్ పార్టీ కేవలం 80 స్థానాలలో మాత్రమే ఇప్పటివరకూ గెలుపొందింది. లేబర్ పార్టీ మెజారిటీ మార్కు దాటి 400 సీట్ల దిశగా దూసుకెళ్లోంది. దీనితో రిషి సునాక్ తన ఓటమిని పూర్తి కౌంటింగ్ కాకముందే అంగీకరించారు. గత 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఈ సారి ఓటమి పాలయ్యింది. రెండేళ్లుగా బ్రిటన్ ప్రధానిగా పనిచేస్తున్న రిషి సునాక్ భారతీయ సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది.