మైలవరం వైయస్సార్సీపీలో ముదురుతున్న వర్గ విభేదాలు
మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వర్గాల మధ్య విభేదాలు ముదిరి పాకనపడ్డాయి. మరోసారి మైలవరం పంచాయితీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు చేరింది. గతంలో ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి సర్ది చెప్పిన ఇక్కడ వర్గ పోరు ఆగటం లేదు. నాలుగు రోజుల క్రితం జోగి రమేష్ అనుచరుడు నల్లమోతు మధుబాబు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను ఆసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై వసంత కృష్ణ ప్రసాద్ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ శ్రేణులను తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు వెళ్లారు. అక్కడ పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మైలవరం వైయస్సార్సీపీలో రోజురోజుకు విభేదాలు ముదరటంతో పార్టీ పెద్దలకు ఈ విషయం తలనొప్పిగా మారింది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం సీటు దక్కించుకోవాలని మంత్రి జోగి రమేష్ అలానే తన పట్టు నిలుపుకోవాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన ప్రయత్నంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. సామాజిక మాధ్యమాల వేదికగా రెండు వర్గాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అయితే విభేదాలు సమస్యపై ఎందుకు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వైయస్సార్సీపీ పై వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని విడబోతున్నారని ప్రచారం జరిగింది. మంత్రి జోగి రమేష్ వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కొద్ది కాలం నుంచి నియోజకవర్గానికి దూరమయ్యారు. ఆడపాదడప కార్యక్రమాలకు హాజరై వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆయన దోపిడీ కొనసాగుతుందని మంత్రి జోగి రమేష్ వర్గం గుర్రుగా ఉంది.

ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ అనుచరుడు వైఎస్ఆర్సిపీ యువజన విభాగం నాయకుడు నల్లమోతు మధుబాబు నాలుగు రోజుల క్రితం ట్రక్ టెర్మినల్ పై మెగా ఇంజినీరింగ్ కంపెనీకి సంబంధించిన బూడిద లారీలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని లారీలను పంపించి వేయడంతో మధుబాబు ఎమ్మెల్యే వసంతను అసభ్య పదజాలంతో దూషించారు. కాగా మంత్రి జోగీ రమేష్ అనుచరుడు మధుబాబును వైయస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్గం పట్టు పట్టింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ నేతలను తీసుకొని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద మంగళవారం పంచాయితీ పెట్టారు. మధుబాబును సస్పెండ్ చేయాలని కొంతమంది, 2024లో సీటు ఎవరికో తేల్చాలని కొంతమంది పట్టు పట్టినట్లు తెలుస్తోంది. మరి మైలవరం వైయస్సార్సీపీలో మంత్రి జోగీ రమేష్, ఎమ్మెల్యే వసంత వర్గాల విభేదాలపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.