“అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమే”..కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో నేడు జరిగిన కేటీఆర్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమే. ఢిల్లీలో దీక్ష చేద్దాం.. అమరణ దీక్షలు చేద్దామనడం వాళ్ల ఆలోచనను స్పష్టం చేస్తోంది. మోదీ సర్కారు ద్వారా పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశాం. అందుకే 35శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపరచడం జరిగింది. కేసీఆర్ ఎలాగైతే.. వ్యవహరించాడో అదే తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నాడు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే నేటి ముఖ్యమంత్రి రేవంత్ నడుస్తుండటం.. తెలంగాణ ప్రజల దురదృష్టం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో తమ ప్రభుత్వ అసమర్థత నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇలా కేంద్రం మీద గతంలో బీఆర్ఎస్ బురదజల్లింది. ఇవాళ కాంగ్రెస్ కూడా డ్రామాలు ఆడుతోంది. కేంద్రం ఇప్పటిదాకా పదేళ్లలో 10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా రూపంలో 2 లక్షల కోట్లు తెలంగాణకు బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన విషయం వాస్తవాలు కాదా? ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే నిధులను దారిమళ్లించారు.
ఉపాధిహామీకి నిధులిస్తే.. ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి ఆ నిధులను దుర్వినియోగం చేశారు. పంచాయతీరాజ్ సంస్థల నిధులిస్తే.. వాటిని దారిమళ్లించారు. కనీస అవసరాలు, మౌలికవసతుల కల్పన విషయంలో ఈ నిధులు వెచ్చించకుండా పక్కదారి పట్టించారు. కేంద్ర ప్రభుత్వం వడ్డీరాయితీల రూపంలో 7వేల కోట్లు ఇచ్చింది.
రైతులకు సంబంధించిన సంక్షేమపథకాలను అమలుచేస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. రామగుండం విద్యుదుత్పత్తి విషయంలో, వరంగల్ లో కోచ్ లు, వ్యాగన్స్, రైల్ ఇంజన్లు తయారయ్యే కేంద్రానికి ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రారు. అలాంటిది ఇవాళ మళ్లీ కోచ్ ఫ్యాక్టరీ అనడం విడ్డూరం.
గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయానికి.. భూసేకరణ చేయనప్పటికీ.. నిధులు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో కలిసి తాత్కాలిక భవనాన్ని ప్రారంభించాను. మళ్లీ ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ సంగతేంటి? అని అడగడం హాస్యాస్పదం. రైల్వే, రోడ్డు మౌలికవసతుల కోసం వేల కోట్లు కేటాయించాం.
రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 10,990 కోట్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ప్రజలకు అవసరమైన పెట్రోలియం ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టులను తీసుకొచ్చాం. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధికి గణనీయంగా నిధులిచ్చాం. 40 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి 11వేల కోట్లు ఖర్చుచేశాం. రామగుండంలో 6300 కోట్లతో ఫెర్టిలైజర్ కంపెనీ ఏర్పాటుచేశాం. బీబీనగర్ లో ఏయిమ్స్ ఆసుపత్రి దాదాపుగా పూర్తయింది. ఇదంతా అభివృద్ధి కాదా.. దీనికి తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయవద్దు ‘ అంటూ హెచ్చరించారు.

