గ్రామాలకు మినీ కలెక్టరేట్లుగా డీడీవో లు
రాష్ట్రవ్యాప్తంగా మరో 76 కార్యాలయాలను వర్చువల్‌గా ఏపీ డిప్యూటీ సీఎం ప్రారంభించారు. చిత్తూరులోని రెడ్డిగుంటలో డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు . గ్రామీణ స్థానిక సంస్థల్లో 10-12 రకాల పౌరసేవలను ఒకే వేదిక కిందకు తీసుకురావడం కోసమే ఈ డీడీవో వ్యవస్థను తీసుకొచ్చామని, ఇవి గ్రామాలకు మినీ కలెక్టరేట్లుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణ ద్వారా 22 ఏళ్లుగా ఉద్యోగోన్నతులు లేని ఎంపీడీవోలు డీడీవోలుగా మారారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10,000 మందికి పారదర్శకంగా ఉద్యోగోన్నతి కల్పించామని తెలిపారు. ఇది ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైకాపా ఐదేళ్ల పరిణామాలను మదింపు చేసి సరికొత్త వ్యవస్థను తెస్తున్నామని, డీడీవో కార్యాలయాల్లో ఆర్డీవో స్థాయి అధికారిని నియమిస్తున్నామని పవన్ కల్యాణ్ వివరించారు. 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,350 పంచాయతీలను స్వయంపాలనా వ్యవస్థలుగా తీర్చిదిద్దామని, పురపాలికల్లో మాదిరిగానే గ్రామాల్లోనూ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధిదీపాలు వంటి విభాగాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యవస్థలపై ఆత్మవిశ్వాసం పెరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసించగా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు దీన్ని విప్లవాత్మకమైన మార్పుగా కొనియాడారు. ఈ సందర్భంగా, గంజాయి సాగును తగ్గించి, ఉపాధి నిధులతో పండ్ల మొక్కలు నాటించి ప్రజల ఆదాయాన్ని పెంచిన చిత్తూరు ప్రస్తుత కలెక్టర్ సుమిత్‌కుమార్, దినేష్‌కుమార్ లను పవన్ కల్యాణ్ అభినందించారు.

