ద్యావుడా….మృతదేహంతో వారం రోజులుగా ఇంట్లోనే!
సమాజంలో ఒక్కో రోజు ఒక్కో అమానవీయ ఘటన చోటు చేసుకుంటుంది.వినడానికి,చూడడానికి,మాట్లాడడానికి కూడా వీల్లేని విధంగా ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమౌతున్నాయి.ప్రపంచ మహానగరాల సరసన మేటిగా నిలిచిన ఈ భాగ్యనగరంలో ఓ అభాగ్య కుటుంబ గాథ ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ కలచివేస్తుంది. చనిపోయిన తల్లికి దహన సంస్కారాలు చేసేందుకు డబ్బులులేక ఆత్మాభిమానాన్ని చంపుకుని నోట్లో గుడ్డలు కుక్కుకుని కుళ్ళి కుళ్లి రోధిస్తున్న ఇద్దరు కూతుళ్ల గాధ ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు తెప్పిస్తుంది. సికింద్రాబాద్ లోని వారసిగూడలో ఓ మధ్యవయస్కురాలైన మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో దహన సంస్కారాలకు డబ్బులు లేక వారం రోజులు ఇంట్లోనే ఉంచుకున్న కూతుళ్ళ దీనావస్థ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇరుగు పొరుగు వారు మృతురాలి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.దీంతో నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడయ్యాయి.తమ తల్లి అనారోగ్యంతో చనిపోయిందని, బంధువులు ఎవరూ లేరని, తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మను చూస్తూ ఇలా ఉండిపోయామని చెప్పడంతో ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యంతమౌతున్నారు.పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.