దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీ..?
కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారైంది. పార్టీ పేరు, జెండా, అజెండాలు సిద్ధమయ్యాయి. విజయ దశమి రోజు జాతీయ పార్టీని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్‌లో రైతుల సమక్షంలో జాతీయ పార్టీని ఆవిష్కరిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చాలని గతంలో చర్చ జరిగింది.

జాతీయ పార్టీకి రైతు పేరు..?
అయితే.. జాతీయ పార్టీలో రైతు పేరు వచ్చేలా మార్పులు చేయాలని.. పార్టీ జెండా సైతం ఆకుపచ్చ రంగులో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. రైతు నాగలి గుర్తుకు ఆయన ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. కొందరు టీఆర్‌ఎస్ నాయకులు మాత్రం పార్టీ జెండా గులాబీ రంగులోనే ఉండాలని.. రైతులతో పాటు బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని గుర్తుకు తెచ్చేలా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను జెండాలో పొందు పర్చాలని సూచిస్తున్నారు.

దళితులు, రైతుల ఓటు బ్యాంకుపై కన్ను
కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ప్రధానంగా దళితులు, రైతుల ఓటు బ్యాంకుపై కేసీఆర్ కన్నేశారు. జాతీయ స్థాయిలోనూ కారు గుర్తుతోనే ముందుకెళ్లాలని నిర్ణయించారు. అయితే.. ఈ గుర్తు జాతీయ స్థాయిలో లభించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నితీశ్ కుమార్, కేజ్రీవాల్, దేవెగౌడ, ఉద్ధవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, స్టాలిన్, తేజస్వి యాదవ్ తదితర ప్రాంతీయ పార్టీల నాయకులతో కేసీఆర్ సమావేశమై వ్యూహాలు రచిస్తున్నారు.

