Andhra PradeshNews

దర్శన క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపివేత

తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది. శ్రీవారి దర్శనం కోసం రెండు రోజులుగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. విపరీతమైన రద్దీ ఏర్పడింది. వరుస సెలవులతోపాటు తమిళులు పవిత్రంగా భావించే పురటాసి మాసం అన్నీ ఒకేసారి కలిసి రావడంతో తిరుమల కొండ సందడిగా మారింది. మరో నాలుగు రోజులు రద్దీ ఉంటుందని టీటీడీ వర్గం అంచనా. వర్షాన్ని లెక్క చేయకుండా శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఈ క్రమంలో దర్శన క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్నవారికే శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం తిరిగి క్యూలైన్లలోకి భక్తులను అనుమతించనున్నారు. భక్తులను క్యూలైన్లలోకి తరలించే బస్సులను సైతం నిలిపివేశారు. 

మరోవైపు వీఐపీల తాకిడి కూడా అదే స్థాయిలో ఉంది. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం, ఎంపీ యంవీవీ సత్యనారయణ, మాజీ క్రికెటర్‌ కేదర్‌ జాదవ్‌, నటి గౌతమి వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే  70,007 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్లకు చేరింది. పురటాసి మాసం పూర్తయ్యే దాకా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది.