బిక్కుబిక్కుమంటున్న కడెం ప్రాజెక్టు ‘లోతట్టు గ్రామాలు’
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతోంది. దీనితో ఇక్కడి లోతట్టు గ్రామాల ప్రజలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తోంది. దానికి తోడు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఇది 700 అడుగులు. ఇప్పటికే ఉన్న 18 గేట్లలో 14 గేట్లను ఎత్తివేశారు అధికారులు. మరో 4 గేట్లు తెరుచుకోవడం లేదు. అధికారులు ఎంత ప్రయత్నించినా ఇవి తెరుచుకోకుండా మొరాయిస్తున్నాయి. గత ఏడాది వరదలకే నానా ఇబ్బందులు పడిన అక్కడి లోతట్టు గ్రామాల ప్రజలు ఇప్పుడు ఈ వరద నీటి కారణంగా చాలా భయపడుతున్నారు. వరద ఇంకా కొనసాగితే భారీ స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఈ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు పంపించే ఏర్పట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

