InternationalNews

సిత్రాంగ్‌ తుఫాన్‌ బీభత్సం.. 35 మంది మృతి.. 10 వేల ఇండ్లు ధ్వంసం

బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్‌ తుఫాన్‌ అల్లకల్లోలం సృష్టించింది. సోమవారం రాత్రి బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌ సమీపంలోని టింకోనా ద్వీపం, శాండ్‌విప్‌ మధ్య సిత్రాంగ్‌ తీరాన్ని దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్‌ తీరాన్ని దాటుకుని బంగ్లాదేశ్‌ తీరాన్ని దాటింది. కుండపోత వర్షాలు, వరదలతో 35 మంది చనిపోయారు. సుమారు 10 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయి. 6,000 హెక్టార్ల (15000 ఎకరాలు) పంటలు నాశనమయ్యాయని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. 15 తీర ప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్తు లేకుండా చీకట్లోనే ఉన్నారు. వేల సంఖ్యలో ఫిషింగ్‌ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. తుఫాన్‌ వల్ల విద్యాసంస్థలను మూసివేశారు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించింది. విద్యుత్‌, టెలికాం సేవలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌కు సమీపంలో ఉన్న భారత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ తుఫాన్‌ ప్రభావం కనిపిస్తోంది. బెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. తీర ప్రాంతాల నుండి ప్రజలను తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.