NationalNewsNews AlertTelangana

ఆన్‌లైన్‌లో జర భద్రం-తెరవెనుక మోసం

ప్రస్తుత ప్రపంచం అంతా డిజిటల్‌మయం అయిపోయింది. టెక్నాలజీ పెరుగుతోంది. సెల్ కంపెనీలు పోటీపడుతూ లేటెస్ట్ మోడల్ ఫోన్స్ మార్కెట్‌లో వదులుతున్నారు. మనం కూడా కొత్తకొత్త మోడల్ ఫోన్స్ వాడుతూ ఎంజాయ్ చేసేస్తున్నాము. మన ఖాతాలకు, ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్నింటికీ లింకులు, దీనితో సైబర్ నేరగాళ్ల పని మరింత ఈజీగా మారిపోయింది. ఇంతకు ముందులా దొంగతనాలు ఇళ్లలో జరగడం లేదు. నేరగాళ్లు ఇంట్లో కూర్చునే గుట్టుచప్పుడు కాకుండా ఖాతాలో ఉన్నమొత్తాన్ని లాగేస్తున్నారు. రోజుకో కొత్త ఐడియాలతో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలను ఉచ్చులో లాగుతున్నారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన నేపథ్యంలో మోసాలు కూడా అదేస్థాయిలో జరుగుతున్నాయి. గడచిన మూడేళ్లకాలంలో ప్రతీకుటుంబంలో ఒకరు సైబర్ మోసం బారిన పడినట్లు తాజాసర్వే తెలియజేసింది. దేశంలో దాదాపు 42 శాతం ప్రజలు ఏదో ఒక మోసానికి గురైనారు. దాదాపు ప్రతీనెల 200 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు.

డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఆన్‌లైన్ పేమెంట్లతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 5 వేల కేసులు సైబర్ నేరాలు నమోదు అయినట్లు ఆసర్వే పేర్కొంది. పైగా ఈ సైబర్ నేరగాళ్లు ప్రముఖవ్యక్తులను కూడా వదలకుండా మోసాలకు పాల్పడుతున్నారు. ఈమధ్యనే తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సతీశ్ చంద్ర పేరుతో మోసానికి పాల్పడ్డారు. ఆయన చిత్రాన్ని వాట్సాప్ డీపీ గా పెట్టుకుని ఒకరినుండి 2 లక్షలు కాజేసారు. ఇంతేకాక ఫేస్బుక్ ఫ్రొఫైల్స్‌తో కూడా నకిలీఖాతాలు సృష్టించి డబ్బు కాజేస్తున్నారు. ఇంకా OLX వంటి యాప్‌ల సాయంతోనూ డబ్బు మాయం అవుతోంది. అమ్మాయిల ఫొటోలను అడ్డం పెట్టుకుని, మార్ఫింగ్‌లు చేస్తూ, పెళ్లి మాట్రిమోనీ సైట్లలోనూ, ఇలా ఒకటి కాదు రెండుకాదు, ఇందుగలడందు లేడన్నట్లు ప్రతీచోటా, ప్రతీ మొబైల్ ట్రాన్సాక్షన్స్‌ చేయడానికి భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజుకో స్కామ్, పూటకో డేటా చోరీలతో సైబర్ నేరస్తులు మూడు పువ్వులు, ఆరు కాయలుగా తమ పబ్బం గడుపుకుంటున్నారు.

అతి జాగ్రత్తగా ఓటీపీ నెంబర్లు ఎవరికీ చెప్పకుండా, లేనిపోని సైట్లలో సామాగ్రిని కొనుగోలు చేయకుండా, సోషల్ మీడియాలలో తమ ప్రతీ విషయాలను షేర్లు చేయకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకూ దీనిని అరికట్టవచ్చు.