News

ప్రస్తుతం స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి తదుపరి ప్రధాని రావడానికి ఇంకెంత కాలం పడుతుందని జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ.. చంద్రబాబు, నితీశ్ కుమార్ లాంటి వారు మద్దతిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడాది లోగా ప్రధానమంత్రి వస్తారని అన్నారు. జనరేషన్ గ్యాప్ కారణంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆయన ఆసక్తికర పోలిక తెచ్చారు. గతంలో ఇంట్లో అమ్మ, నానమ్మ భోజనం పెడితే తినేవారని… ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడితే రెండు నిమిషాల్లో వస్తుందన్నారు. ఇప్పుడు రాజకీయాలు అలాగే ఉన్నాయన్నారు. ప్రస్తుతం సిద్ధాంతపరమైన రాజకీయాలు తక్కువగా ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటి వరకు తెలంగాణలోని భద్రాచల రాముడి దర్శనం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి సహా ఇతర సమస్యలపై విన్- విన్ పద్ధతిలో పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు గెలుచుకుంటామని చెప్పిందని, కానీ 240 వద్ద ఆగిపోయిందన్నారు. ఇది బీజేపీ ఓటమిగా తాను భావించడం లేదని… మోదీ ఓటమే అన్నారు. కాంగ్రెస్ వరుసగా ఓడిపోతున్నప్పటికీ రాహుల్ గాంధీ ఫీల్డ్ ను వదిలి పెట్టలేదన్నారు.