సామాన్యులకు కరెంట్ షాక్.. మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..
తెలంగాణాలో విద్యుత్ ఛార్జీల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు 3 కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ఈఆర్సీకి ప్రతిపాదించాయి. ఆమోదం లభిస్తే రెవిన్యూ లోటును పూడ్చుకోవడానికి రూ. 1200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్ కు స్థిర ఛార్జీని రూ. 10 నుంచి 50 కి పెంచాలని డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించాయి. ఆ కేటగిరిలో 20% లూపే ప్రజలు ఉంటున్నందున అంతగా ప్రభావం పడదని అంచనా. పరిశ్రమలకు సంబంధించి 11 కేవీకి యూనిట్ కు రూ. 7.65 , 33 కెవికి రూ. 7.15, 132 కెవికి రూ. 6.65 వసూలు చేస్తుండగా, ఇకపై అన్ని కేటగిరీలకు రూ. 7.65 చెప్పునే వసూలు చేయాలని కోరాయి.
రాష్ట్రంలో మొత్తం కోటి 30 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్ల లోపు వాడుకునే వారు 80 శాతానికి పైగా ఉన్నారు. ఈ నివేదికను 2023 నవంబరు 30 కల్లా మండలికి ఇవ్వాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవ్వలేదు. 2024 జనవరి ఆఖరుకు ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించినా లోక్ సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి. దాంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆలస్యానికి 21 లక్షల జరిమానాను డిస్కంల నుంచి ఈఆర్సీ వసూలు చేసింది.