మంగళగిరిలో కోట్ల రూపాయలతో కరెన్సీ వినాయకుడు
వినాయకచవితి సందర్భంగా మనం గణపతిని రకరకాల రూపాలతో అలంకరించి మురిసిపోతుంటాం. కొన్ని ప్రదేశాలలో వినాయక మండపాలను, ప్రతిమలను ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దుతున్నారు. వాటిలో ఏపీలోని మంగళగిరిలో తయారు చేసిన వినాయకుడు ప్రత్యేకంగా కరెన్సీ నోట్లతో ముస్తాబయి అందరినీ ఆకర్షిస్తున్నారు. మంగళగిరి మెయిన్‌బజార్లో వ్యాపారవేత్త బాలాజీ గుప్తా ఆధ్వర్యంలో గత 18 ఏళ్లుగా కరెన్సీ నోట్లతో వినాయకుడిని అలంకరిస్తున్నారు. లక్ష రూపాయలతో మొదలుపెట్టిన ఈ అలంకరణ ప్రతీ ఏటా పెరుగుతూ పోయి ఇప్పుడు రూ.2.3 కోట్లతో ప్రత్యేకంగా నిలిచింది. మంగళగిరి మెయిన్ బజార్‌లోని వ్యాపారులంతా కూడా వారి వద్ద ఉన్న కరెన్సీ నోట్లు వాటాలు వేసుకుని ఇస్తారు. బ్యాంకుల నుండి కొత్త కరెన్సీ నోట్లను తీసుకుని, పువ్వుల రూపంలో అమర్చి వినాయకునికి దండగా వేశారు. రూ.10, 20, 50, 100, 500 నోట్లను వివిధ రకాలుగా అలంకరణకు ఉపయోగిస్తున్నారు. వినాయకుని మండపాన్ని కూడా నోట్లతోనే అలంకరించారు. ఈ వినాయకుని అలంకరణ చూస్తే ముక్కున వేలు వేసుకోవల్సిందే.
