Andhra PradeshHome Page Slider

వైయస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు

• ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
• మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి రావాలని ఆదేశాలు
• ఐదు రోజులు గడువు కావాలని సీబీఐ ని కోరిన అవినాష్ రెడ్డి

వైయస్ వివేకానంద రెడ్డి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కి సిబిఐ నోటీసులు జారీ చేసింది. మరోవైపు సిబిఐ బృందం సోమవారం పులివెందులకు చేరుకుంది. కడపకు చేరుకున్న బృందం పులివెందులకు వచ్చి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించింది. అదేవిధంగా ఓఎస్ డి కార్యాలయ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించింది. క్యాంపు కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంటిని పరిశీలించింది. అదేవిధంగా సీఎం క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాలను గంట పాటు అధికారులు పరిశీలించారు. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నవారి నుంచి ఎంపీ తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారా అని ఆరా తీశారు. లేరనే సమాధానం రావడంతో వెనుతిరిగారు. భాస్కర్ రెడ్డి ఆచూకీ తీసిన అధికారులు ఇక పులివెందుల నుంచి కడపకు చేరుకున్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనే కేసులో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ విషయంలో కోర్టు నిర్ణయం ఇంకా రాకపోగా అనూహ్యంగా సోమవారం సిబిఐ బృందం ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను సీఎం క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించటంతో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. సిబిఐ విచారణలో మలుపు చోటు చేసుకున్న క్రమంలో తాజాగా అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయటం సంచలనం రేపుతుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ ను సిబిఐ ప్రశ్నించనుంది. అధికార వైసీపీకి చెందిన ఎంపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సోదరుడు అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలవటం రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తుంది. అయితే సిబిఐ నోటీసులకు ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు కేసు దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. ఒకరోజు ముందుగా నోటీసు పంపడం వల్ల తాను ముందుగా అనేక కార్యక్రమాల కు హాజరు కావాల్సి ఉందని అందువల్ల ఐదు రోజులు గడువు ఇస్తే ఎప్పుడు పిలిచినా హాజరవుతానని సిబిఐకి ఆయన తెలియజేశారు.