NationalNews

రెండేళ్లలో కోటి ఉద్యోగాలు..!

ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఎలక్ట్రానిక్‌, స్టార్టప్‌లు, ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల రంగాల్లో రానున్న రెండేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించుకున్నామని కేంద్ర టెలికం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఐటీ-ఐటీఈఎస్‌, స్టార్టప్‌.. మూడు స్తంభాలు అని చెప్పారు. ఆయా రంగాలు ఇప్పటికే 88-90 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాయన్నారు. భారత దేశం టెక్నాలజీ వినియోగదారు నుంచి టెక్నాలజీ ఉత్పత్తిదారు స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు.

అన్ని సదుపాయాలతో స్టార్టప్‌లకు ఏర్పాట్లు..

స్టార్టప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా అన్ని సదుపాయాలతో (ప్లగ్‌ అండ్‌ ప్లే) ఏర్పాట్లు చేసిందని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్లగ్‌ అండ్‌ ప్లే సదుపాయాలను దేశంలోని 64 పట్టణాల్లో ఆఫర్‌ చేస్తున్నామని ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌ కుమార్‌ చెప్పారు. ఇందులో 53 కేంద్రాలను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో నెలకొల్పామన్నారు. రూ.5-10 లక్షల వరకు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామన్నారు.