Home Page SliderNational

Exclusive క్రేజీడ్రామా.. ఢిల్లీలో ఎవరి నటనకు జనం పట్టకడతారు!

అనగనగ ఒక ఊరు. ఆ ఊరు పేరు ఢిల్లీ. ఆ ఊరికి నాయకుడుంటాడు గానీ అధికారాలు అంతంత మాత్రమే. పైనుండే పెద్దాయనే అన్నీ చూసుకుంటారు. ఆయన పైకి కన్పించకున్నా, నమ్మినబంటును పెట్టుకొని రిమోట్ కంట్రోల్ ద్వారా అంతా ఆడిస్తుంటాడు. ఈ ఉపమానాలన్నీ కూడా పూర్తి రాష్ట్ర హోదా లేని ఢిల్లీకి చెందినవే. అక్కడ నాయకుడు కేజ్రీవాల్. పెద్దాయన ప్రధాని నరేంద్రమోదీ. ఒకరు దేశాన్ని పదేళ్లుగా అప్రతిహాతంగా ఎలుతుంటే మరొకరు అంతకంటే ముందు నుంచి ఢిల్లీని తిరుగులేకుండా పాలిస్తున్నారు. కానీ లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వెన్నువిరిచింది. స్కామ్ ఎలా జరిగింది. అందులో అసలు కథ ఏంటన్నది కాసేపు పక్కనబెడితే మరో నాలుగు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలున్నాయ్. అక్కడ ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారన్నదానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో మరోసారి గెలిచి, తన పాతివ్రత్యాన్ని రుజువు చేసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తుంటే, ఇప్పుడు దెబ్బ కొడితే భవిష్యత్‌లో కేజ్రీవాల్‌తో ఇబ్బందుండదని ప్రధాని మోదీ భావిస్తున్నారు.

ఢిల్లీ దంగల్ ఇలా షురూ చేశారు!
ఇక విషయానికి వస్తే, అరవింద్ కేజ్రీవాల్ సినిమాల్లో ఉండి ఉంటే, ఆయన ఇప్పటికే అనేక ఆస్కార్ అవార్డులను గెలుచుకునేవారు. ఎందరో యాక్టింగ్ లెజెండ్స్‌ని మించిపోయేవారు. తాజాగా ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి ఆ డ్రామాను మరింత విస్తృతం చేశారు. అయితే ఈసారి మరో ఆస్కార్‌ను పొందుతారో లేదో చూడాలి. తాజా మూవీలో ఆయన తనను తాను శక్తివంతమైన వ్యవస్థచే బలిపశువుగా మారానని, కానీ ప్రజాబలంతో అమరుడిగా తిరిగి వచ్చానని చిత్రీకరించుకుంటున్నారు. ప్రజల ముందు తనను తాను హీరోగా చూపిస్తున్నారు. తిరిగి విజయం సాధించడం ఖాయమన్న సందేశాన్ని పార్టీ నేతలకు ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీని నమ్మని ప్రజలకు ఆయన నిజంగా హీరోనే అనుకోవాల్సి ఉంటుంది.

ఢిల్లీ ప్రజా తీర్పు ఈసారి ఎలా ఉండబోతుంది?
కేజ్రీవాల్ రాజీనామా వ్యవహారం 1970-80లలోని ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఫార్ములా చిత్రాలను పోలి ఉంటుందని చెప్పాలి. కానీ కాలం మారింది. ఇప్పుడు ఆ ఫార్ములాలు ఎంత మేరకు విజయాన్ని అందిస్తాయో చూడాలి. సోషల్ మీడియా, AI ద్వారా ప్రభావితమవుతున్న కాలంలో ప్రజల ఆలోచనలు, అభిరుచులు, ఆకాంక్షల్లో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రజలకు తెలుస్తోంది. ప్రధాని మోదీ 2024లో తిరుగులేని విజయం సాధిస్తానని భావించినా అలా జరగలేదు. అదేవిధంగా ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ సినిమాకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఢిల్లీ ప్రజలు ఆయన ప్రభుత్వ పనితీరును బట్టే తీర్పు ఇస్తారు గానీ ఆయనను విపరీతంగా ఆరాధించి, అభిమానించి తీర్పు ఇస్తారనుకోలేం. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ బాగా పనిచేశారని నమ్మితే మళ్లీ ఓటేస్తారు. ప్రజలు అలా భావించకుంటే, కేజ్రీవాల్ కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. రాజీనామా చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందొచ్చని కేజ్రీవాల్ భావిస్తున్నా.. అది బలహీనతకు నిదర్శనమని చెప్పాలి. జైల్లో ఉన్నప్పుడు సీఎంగా ఉండి, బయటకు వచ్చాక రాజీనామా చేయడం ఇదంతా డ్రామా అన్పిస్తోందన్న భావన కూడా ప్రజల్లో వ్యక్తమవ్వొచ్చు.

ఊరందరిదీ ఒకదారి, కేజ్రీవాల్‌ది మరోదారా?
కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ సమయంలో రాజీనామా చేసి ఉంటే సీన్ మరోలా ఉండేది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సాక్ష్యాలు లేనందువల్ల శిక్ష పడదని నమ్మే కేజ్రీవాల్, కేంద్రాన్ని కార్నర్ చేసేలా రాజకీయం చేయలేకపోయారన్న ప్రచారం కూడా ఉంది. మోదీని నేరుగా ఢీకొట్టే విషయంలో కేజ్రీవాల్‌కు రిజర్వేషన్స్ ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. హేమంత్ సోరెన్ లాగా, లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, దేశ రాజధానికి బాధ్యత వహించడానికి కొత్త నాయకుడిని నియమించి ఉంటే బాగుండేది. జైలు నుండి పాలన చేస్తానని ప్రకటించి, ఆ పనిచేయలేకపోయాడు. రాజ్యాంగస్ఫూర్తితో కేజ్రీవాల్ కాంప్రమైజ్ అయ్యారన్న భావన ఉంది. రాజ్యాంగమంటే కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని, ఆత్మతో కూడిన జీవి అన్న విషయాన్ని ఆయన మరచిపోయారు. రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి, బీజేపీపై యుద్ధం చేస్తే చాలని భావించారు.

అరెస్ట్ తర్వాత రాజీనామా చేయాల్సింది
ఒక ముఖ్యమంత్రి జైలుకు వెళితే రాజీనామా చేయమని రాజ్యాంగం కోరలేదు. ఇది ముమ్మాటికీ నిజం. అయితే, దేశంలో కొందరు ముఖ్యమంత్రులు అరెస్టు సమయంలో రాజీనామా చేస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, హేమంత్ సోరెన్ అదే పని చేశారు. ఒకసారి, జైలు నుండి, లాలూ మినహా మిగతా అందరూ మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టినవారే. కేజ్రీవాల్ ఆ సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. ఇది ఎలా ప్రజలు తీసుకుంటారన్నది చూడాలి. గత ఐదు నెలల్లో ఢిల్లీలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఢిల్లీకి ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ జైల్లో ఉండి, పాలన సాగించలేకపోయాడు. ఆ సమయంలో రాజీనామా చేసి ఉంటే అది ఆయనకు గౌరవన్నిచ్చి ఉండేది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. కానీ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాజీనామా చేసి, తాను కేంద్ర ప్రభుత్వ కుట్రలో శిక్ష అనుభవించానన్న భావనను వ్యక్తం చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. 2011లో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడిన కేజ్రీవాల్ యువతకు స్ఫూర్తి. అవినీతి వ్యతిరేక పోరాటానికి కేంద్రబిందువు. నిర్భయ పోరాటయోధుడు, ప్రపంచం కీర్తించిన కేజ్రీవాల్ తన ముందు హాజరుకావాలని ఈడీ నోటీసు ఇచ్చినప్పుడు, ధైర్యంగా ఫేస్ చేసి, విచారణకు హాజరయ్యేవాడు. ఆ రోజే ఈడీ దమ్ముంటే తనని అరెస్టు చేయాలని, దానికి భయపడేది లేదని, తాను ఎలాంటి నేరం చేయలేదని, జైలుకు వెళ్లే భయం లేదని ప్రకటించారు. కానీ ED ముందు హాజరు కావడానికి నిరాకరించాడు. తప్పించుకునేందుకు సాకులు వెతకడం ప్రారంభించాడు. ఇలా ఒక్కో తప్పటుగు పడుతూ వచ్చింది.

అవినీతి వ్యతిరేక యోధుడనే ఆరాధన
కేజ్రీవాల్ అంటే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం అన్న భావన ముందుగా ప్రజలకు గుర్తుకువస్తుంది. అవినీతికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేశాడని, ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అలాగే చేయాలని ప్రజలు భావిస్తారు. ఏ సాక్ష్యాధారాలు లేకుండా, దేశంలోని అగ్రనేతలపై అవినీతి ఆరోపణలు చేసి, రాజీనామాలు చేసి చట్టాన్ని అమలు చేసే సంస్థలను ఎదుర్కోవాలని ఆయన కోరేవారు. నిర్భయంగా ఎదుర్కోవాలని ఆయన చెప్పేవారు. ఎద్దును కొమ్ములతో పట్టుకొని పోరాడాలన్నది ఆయన ఉద్దేశం. ఇలా మాట్లాడటం ద్వారా, రాజకీయాలు చేయడానికి కానీ, రాజకీయాలను మార్చడానికి కానీ రాజకీయాల్లో లేని వ్యక్తిని ప్రజలు కొత్త రూపంలో చూశారు. ఇలా ప్రజలు కేజ్రీవాల్ అంటే ప్రేమలో పడ్డారు. ఇలా ఎందరో కేజ్రీవాల్ పంచన చేరారు. దేశం మారుతుందనే ఆశతో కేజ్రీవాల్‌తో చేరారు. అయితే అరెస్టు కాకుండా, కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి పారిపోవడాన్ని చూసి వేలాది మంది మద్దతుదారులు, అభిమానులు నిరాశకు గురయ్యారు.

అవ్వా కావాలి.. బువ్వా కావాలన్న ఫీలింగ్
ED నుండి తొమ్మిది నోటీసులను అందుకున్నాడు. తనను తాను రక్షించుకోవడానికి, కోర్టును ఆశ్రయించాడు. అరెస్టు నుండి రక్షించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించినప్పుడు, ED నివాసానికి వచ్చి, జైలుకు తీసుకెళ్లడం.. పరిణామన్నంతటినీ తను అనుకూలంగా మలచుకోవాలని చూశారు. కానీ తానో క్రూసేడర్ అన్న భావనను కేజ్రీవాల్ కోల్పోయాడు. ఇదంతా చూసిన ఢిల్లీ ప్రజలు, వాళ్లకీ, వీళ్లకీ పెద్ద తేడా ఏముందిలే అనుకున్నారనిపిస్తోంది. అందుకే కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రియాక్ట్ కాలేదు. విడుదల సమయంలో సంతోషం వ్యక్తం చేయలేదు. నాడు కోపంగా లేదు. నేడు వీధుల్లోకి రాలేదు. ఇలా మొత్తంగా కేజ్రీవాల్ ప్రజలతో ఆటలాడుకోవాలన్న భావనను వారు తిరస్కరించారు. కానీ పైన ఉన్న మోదీపై వారికి ఏమాత్రం ప్రేమ ఉందన్నది అనుమానమే. కానీ లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. కేజ్రీవాల్ ఇప్పుడు మిగతా రాజకీయ నాయకులకు భిన్నమైనవాడేం కాదు. సాధారణ రాజకీయ నాయకుడు. అతను ఇకపై సామాన్యులను తన గ్రిప్‌లోకి తెచ్చుకోవడం అంత వీజీయేం కాదు. కేజ్రీవాల్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నాడు కానీ ఇదివరకు ఉన్న దీమా ఎంత మేరకు ఉంటుందో చూడాలి.

ఢిల్లీ ప్రజలకు అరవింద్‌పై క్రేజ్ ఎందుకు లేదు?
మొదటి నోటీసు అందిన రోజే కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసి, అరెస్టు కోసం స్వచ్ఛందంగా లొంగిపోయి ఉంటే, మోదీ ప్రభుత్వం అరెస్టుకు వెనుకాడేదేమో. అప్పుడు అవినీతి వ్యతిరేక క్రూసేడర్‌గా ప్రశంసలు పొందేవాడు. మెస్సీయగా కొత్త ఎత్తులకు చేరుకునేవాడు. ఆ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం అరెస్టు చేసి ఉంటే వారికి ఎదురుదెబ్బ తగిలేది. అన్నా ఉద్యమ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, ఇతరులను అరెస్టు చేసినప్పుడు, ఢిల్లీ వీధులు నిరసనకారులతో నిండిపోయాయి. వారిని విడుదల చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేకుండా పోయింది. ఆ అంశాన్ని కేజ్రీవాల్ మరచిపోయారు. ఈసారి జైలులో ఉన్నప్పుడు వీధుల్లోకి జనం అసలే రాలేదెందుకు? పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రచారానికి జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా కేజ్రీవాల్‌కు గానీ, ఆయన పార్టీకి గానీ ఎలాంటి సానుభూతి లభించలేదు. ఢిల్లీలో ఆప్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి నియామకం ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపదు. ఎవరికి పదవి వచ్చినా కేజ్రీవాల్‌ తెరవెనక అసలు సత్తా చాటుతారనేది అందరికీ తెలుసు. కేజ్రీవాల్ ప్రజల మద్దతు, ఆదరాభిమానాలను తిరిగి పొందాలంటే, పాత ట్రిక్కులు, నాటకీయత సరిపోవు. ఎన్నికలలో గెలిచినా, ఇది ఇంతటితో అయ్యేది కాదు. కేజ్రీవాల్ నేరాన్ని లేదా నిర్దోషిత్వాన్ని కోర్టు మాత్రమే నిర్ణయించగలదు. యుద్ధం సవాలుతో కూడుకున్నది. ఎక్కువసేపు చేయాల్సి ఉండొచ్చు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ అర్థం చేసుకున్నాడు. అందుకే కేజ్రీవాల్ డ్రామానే నమ్ముకున్నాడు. నటనా నైపుణ్యం ఎంత వరకు సఫలీకృతమవుతుందో చూడాలి.