నూరేళ్ల వయసులో నలుగురికి జన్మనిచ్చిన జంట..
నూరేళ్ల వయసులో ఈ జంట తాబేళ్లు నలుగురు పిల్లలకి జన్మనిచ్చాయి. అంతేకాదు, ఇవి తొలిసారిగా తల్లిదండ్రులవడం విశేషం. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూలో ఉన్న మోమీ, అబ్రజో అనే తాబేళ్ల జంట అత్యంత వృద్దజంట. ఇవి వేగంగా అంతరించిపోతున్న వెస్టర్న్ శాంటా క్రజ్ గాలాపగోస్ అనే జాతికి చెందిన తాబేళ్లు. ఇవి తాబేళ్ల జాతిలో అతి పెద్ద తాబేలు కూడా. ఇవి అరుదైన జాతి కావడంతో ప్రత్యేక శ్రద్ధతో వీటిని సాకుతున్నారు జూ సిబ్బంది. ఇవి 100 నుండి 200 ఏళ్లు బతుకుతాయి. మోమీ తాబేలు 2024లో 16 గుడ్లు పెట్టగా, వాటిని వివిధ ఉష్ణోగ్రతలలో భద్రపరిచారు. వాటి నుండి ఆడ, మగ తాబేలు పిల్లలను పొదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వాటిలో 4 గుడ్ల నుండి 4 ఆడ తాబేలు పిల్లలు బయటకొచ్చాయి. ఇవి 80 గ్రాముల వరకూ బరువు ఉన్నాయని, ఆరోగ్యంగా ఉన్నాయని సిబ్బంది చెప్తున్నారు. వీటిని చూసేందుకు ఈ ఏప్రిల్ చివరివారం నుండి సందర్శకులను అనుమతిస్తారు.

