Home Page SliderNational

కర్నాటక కౌంటింగ్ షురూ, విజయంపై బీజేపీ, కాంగ్రెస్ దీమా

కర్నాటక పొలింగ్ విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. 2023లో తుది ఓటింగ్ శాతం 73.19 శాతం నమోదైందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ తెలిపింది. చిక్కబళ్లాపుర జిల్లాలో అత్యధికంగా 85.56 శాతం, బెంగళూరు రూరల్‌లో 85.08 శాతం; అత్యల్పంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) సౌత్ లిమిట్స్‌లో (బెంగళూరు నగరంలోని కొన్ని భాగాలు) 52.33 శాతం నమోదైందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కర్నాటకలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని, 58,545 పోలింగ్ స్టేషన్లలో దేనిలోనూ రీపోలింగ్ సూచించలేదని ఎన్నికల సంఘం (EC) బుధవారం రాత్రి తెలిపింది.

2018 అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటకలో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది హంగ్ అసెంబ్లీకి కారణమైంది. మెజారిటీని పొందలేక 104 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2013 ఎన్నికల్లో 71.83 శాతం పోలింగ్‌ నమోదైంది. బీజేపీకి దక్షిణాది కంచుకోటగా ఉన్న కర్నాటకలో హంగ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఆధిక్యత ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకరిద్దరు కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. 1985 నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నడూ ప్రజలు రెండోసారి ఓటేయలేదు. 38 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాలని బీజేపీ చూస్తుంటే, నైతిక విజయం తమదేనంటోంది కాంగ్రెస్. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ తనయుడు కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వ ఏర్పాటుకు “కింగ్‌మేకర్” లేదా “కింగ్”గా అవతరిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.