భారత్‌లో వేలల్లో పెరుగుతున్న కరోనా కేసులు
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. ఓ పక్క కొత్త వేరియంట్ జెఎన్.1 భయపెడుతోంది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య వేలలో నమోదవుతోంది. నేటికి ఈ సంఖ్య 4,170కి చేరింది. కేరళలో అత్యధిక కేసులు నమోదవుతుండగా, తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కోరలు చాస్తోంది. ఈ కరోనా జేఎన్ 1 రకం వేగంగా ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తోందని వైద్యులు చెప్తున్నారు. మూడు రోజుల క్రితం కేవలం మూడు కేసులు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఈ రకం కేసులు 63 వెలుగు చూశాయి. కేవలం గోవాలోనే 34 కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో కూడా 10 కేసులు వెలుగు చూశాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు, అధికారులు అప్రమత్తం అయ్యారు. కావలసిన కొవిడ్ వార్డులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ముమ్మరం చేశారు. కాగా తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలిమరణం సంభవించింది. నేడు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు. ఏపీలోని విశాఖలో కూడా ఒకరు మరణించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 మరణాలు సంభవించాయి.

