దేశంలో 50 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే దేశాన్ని విడిచి పెట్టేలా కన్పించడం లేదు. కాగా దేశంలో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మొన్నటి వరకు వందల్లో నమోదయ్యే కేసులు ఇప్పుడు మాత్రం రోజుకు వేలల్లోనే నమోదవుతున్నాయి. కాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,753 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. అయితే ఈ తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి చేరింది. దీంతో దేశంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి ఉధృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా టెస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగానే నిర్వహిస్తున్నాయి. అయితే నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,58,625 కరోనా టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా దేశప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉంటూ..వ్యక్తిగత శుభ్రత పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపింది.

