Home Page SliderTelangana

టీజీపీఎస్‌సీ ఆఫీస్ ముందు వివాదాస్పద పోస్టర్లు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ముందు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించడం వివాదాస్పదమయ్యింది. అక్కడి గోడలకు, గేట్లకు నేడు కొన్ని పోస్టర్లు దర్శనమిచ్చాయి. నాంపల్లిలోని టీజీపీఎస్‌సీ, హైదర్‌గూడాలోని తెలుగు అకాడమీ ముందు ఈ పోస్టర్లు కనిపించాయి. ‘గ్రూప్ 1లో కనీసం 150 ప్రశ్నలు కూడా తయారుచేయలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు? సిగ్గు- సిగ్గు’ అంటూ ఈ పోస్టర్లలో రాసి ఉంది. అంతే కాదు ‘టీజీపీఎస్‌సీ తప్పులతో నిరుద్యోగులకు తిప్పలు’ అంటూ మరో పోస్టర్ కూడా కనిపించింది. అలాగే ‘నేను నియంతని తప్పును ఒప్పుకోను’ అంటూ మరో పోస్టర్ వెలిసింది. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పుస్తకాలను కూడా ఎవరూ కొనవద్దంటూ పోస్టలు కనిపించాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.