నియోజకవర్గానికో పరిశీలకుడు, జగన్ కొత్త ట్విస్ట్
◆కీలక నిర్ణయం దిశగా జగన్ అడుగులు
◆ 175 నియోజకవర్గాలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
◆ ఇప్పటికే పరిశీలకుల కోసం ప్రారంభమైన కసరత్తు
◆ వచ్చే వారంలో పరిశీలకులను ప్రకటించే అవకాశం ?
◆ దసరా నుండి పార్టీపై జగన్ ఫుల్ ఫోకస్
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేసే ప్రతి అడుగు… చేసే ప్రతి పని రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సాగుతుంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వ్యూహాత్మక అడుగులు వేస్తున్న జగన్ త్వరలో మరింతగా పార్టీ పటిష్టత కోసం నియోజకవర్గానికి ఒక పరిశీలకుని నియమించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమర్థవంతమైన నాయకుడిని నియోజకవర్గానికి పరిశీలకునిగా నియమించి రాబోవు ఎన్నికల్లో వైసీపీకి అనుకూల వాతావరణ తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే నాటికి 175 నియోజకవర్గాలకు పరిశీలకులను జగన్ నియమిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే అబ్జర్వర్లను నియమిస్తానని జిల్లా స్థాయి పార్టీ సమీక్షలలో ముఖ్య నాయకులకు తెలిపిన జగన్ ఆ దిశగా కసరత్తులు ప్రారంభించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా అదే నియోజకవర్గానికి మరొక పరిశీలకున్ని నియమించాలంటే సమర్థవంతమైన నాయకుడు ఉండాలని జగన్ భావించిన క్రమంలో ఎంపిక కోసం కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సగం పైగా నియోజకవర్గాలకు పేర్లు ఖరారు అయినప్పటికీ సీనియర్ మంత్రులు, నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో పరిశీలకుల నియామకం కోసం జగన్ అన్వేషణ చేస్తున్నారు. పార్టీ నియమించిన నియోజకవర్గ పరిశీలకుడు ఆ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న విషయాలు, అక్కడ నెలకొన్న గ్రూపు వివాదాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా లాంటి విషయాలు ఎప్పటికప్పుడు వాస్తవ రూపంలో సీఎం జగన్‌కు నివేదికల రూపంలో తెలియజేయాల్సి ఉంది.

రాజకీయంగా ఆస్థాయి నైపుణ్యం కలిగిన నేతలను నియమించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆ దిశగానే మంచి అభ్యర్థుల కోసం జగన్ పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గ స్థాయిలో 50 మంది కార్యకర్తలతో సమావేశాన్ని జరిపి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్న జగన్‌కు ఆశించిన స్థాయిలో వారి వద్ద నుండి సరైన సమాచారం రాకపోవటంతో కేవలం రెండు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి మధ్యలోనే ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఆపివేశారు. అబ్జర్వర్లను నియమించిన అనంతరం మరల ఈ కార్యక్రమాన్ని జగన్ కొనసాగిస్తారని అంటున్నారు.

పార్టీ పటిష్టంగా ఉన్న నియోజకవర్గాల్లో పరిశీలకుని సేవలు సమర్థవంతంగా వాడుకోవాలని, అలానే వివిధ సర్వేలలో కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో అదే పరిశీలకుడ్ని ఆ నియోజకవర్గ అభ్యర్థిగా జగన్ ప్రకటించబోతున్నారని అందుకోసమే పటిష్టమైన నాయకులను అన్వేషిస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. పార్టీ పటిష్టత కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న జగన్ అసెంబ్లీ సమావేశాలు, విజయదశమి అనంతరం మరింత వేగంగా పార్టీ పరమైన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఈసారి ఎన్నికలలో గెలుపు తెలుగుదేశం, వైసీపీలకు అత్యంత కీలకం కానుండటంతో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అబ్జర్వర్లను నియమించి పార్టీని పటిష్ట పరచాలని భావిస్తున్న జగన్ వ్యూహాలు ఫలిస్తాయా ? రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం అబ్జర్వర్ల సేవలు ఉపయోగపడతాయా లేదా ? అనేది వేచి చూడాల్సి ఉంది.