కోడెల కుటుంబంపై కుట్ర జరుగుతోంది: కోడెల శివరాం
ఏపీలో టీడీపీ పార్టీపై దివంగత నేత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివరాం మాట్లాడుతూ కోడెల కుటుంబంపై కుట్ర జరుగుతోందని, సొంత పార్టీ నేతలే అధినేత చంద్రబాబును కలవకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.పార్టీ కోసం కష్టపడి పని చేసిన సీనియర్ నాయకులు మృతి చెందితే వారి వారసులకు అండగా ఉన్న పార్టీ కోడెల కుటుంబానికి ఎందుకు అండగా నిలవడం లేదని ప్రశ్నించారు. కోడెల కుటుంబంపై ఈ వివక్ష ఎందుకు..? పార్టీలు మారి వచ్చిన నేతలకు ఇస్తున్న గౌరవం కోడెల కుటుంబంపై ఎందుకు లేదని నిలదీశారు. కోడెల బతికి ఉన్నంతకాలం పార్టీ బలోపేతం కోసం, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం పోరాటం చేశారు.అలాంటి నేత భార్యకు గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవటం తీవ్రంగా బాధిస్తుందన్నారు.రాష్ట్ర, జిల్లా అధ్యక్షులను చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పించాలని, మా బాధ చెప్పుకుంటామని బతిమాలినా పట్టించు కోలేదన్నారు.అధికారం ముఖ్యం కాదని, నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండటమే నాయకత్వమని పేర్కొన్నారు.కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని, ఏది ఏమైనా సత్తెనపల్లి నుండే పోటీ చేసి గెలుస్తానని,కోడెల ఆశయాలను బతికిస్తానని స్పష్టం చేశారు.