కాళ్లు మొక్కి ఓట్లడగనున్న కాంగ్రెస్
మునుగోడు సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటర్ల కాళ్లు మొక్కేందుకూ సిద్ధమవుతోంది. ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా 100 రోజుల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కి ఓట్లు అడిగేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్యానికి పాదాభివందనం పేరుతో నారాయణపూర్ మండలం పోర్లగడ్డ తండాలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

మునుగోడు నియోజక వర్గంలోని 176 గ్రామాల్లో సమన్వయకర్తలను నియమించారు. వీరంతా గ్రామాల్లోనే ఉంటూ స్థానిక పార్టీ కార్యకర్తలతోనూ, ప్రచార బాధ్యులతోనూ సమన్వయం చేసుకుంటారు. గ్రామానికి ఐదుగురు నేతల చొప్పున పార్టీ ప్రచార బాధ్యతలు కూడా అప్పగించారు. `మన మునుగోడు – మన కాంగ్రెస్` కార్యక్రమంలో భాగంగా పేదలకు పండ్లు పంపిణీ చేయాలని, టీపీసీసీ పేరుతో సోనియా, రాహుల్ గాంధీల చిత్రపటాలతో పాటు రాజీవ్ గాంధీ బొమ్మ, హస్తం గుర్తు కలిగిన బ్యాగ్‌ను అందించనున్నారు.

