Telangana

కేసీఆర్ తెలంగాణాను మార్చేస్తాం-రేవంత్

కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మార్చేస్తోందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలా తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ పేరును టి.ఎస్. అని మార్చారని… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టి.జి.గా మార్చేస్తామన్నారు. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రజలను ప్రతిఫలించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిజైన్ చేయిస్తామన్నారు.

ఈనెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విలీన వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 17తో సంబంధం లేని బీజేపీ… రాజకీయాలు చేస్తోందని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హైజాక్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. రెండు పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాయని… వాటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ కొత్త చరిత్రను రాయాలని భావిస్తున్నారని ఆక్షేపించారు. ప్రజలకు నిజాలు చెప్పి.. కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచేలా చేయాలన్నారు రేవంత్.

బూత్‌ల వారీగా ఇద్దరు నేతల నియాకమం
ఇక మనుగోడు గెలుపును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు రేవంత్. నియోజకవర్గాన్ని 8 యూనిట్లుగా మార్చి బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. బూత్‌కు ఇద్దరు చొప్పున 300 బూత్ మునుగొడులో సమష్టిగా పనిచేయాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పని చేయడానికి 8 యూనిట్లుగా విభజించి నాయకులకు బాధ్యతలు నిర్ణయించామన్నారు రేవంత్. ఒక్కో బూత్ బాధ్యత ఇద్దరికీ అప్పగిస్తామన్నారు. సెప్టెంబర్ 18 నుంచి ఇక అందరూ మునుగోడులో తిష్టవేసి పార్టీని విజయతీరాలకు చేర్చాలన్నారు.

అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో రాహుల్ యాత్ర
ఇక దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. అధికార పక్షాల్లో గుబులు రేపుతోందన్నారు. అక్టోబర్ 24న రాహుల్ యాత్ర తెలంగాణకు చేరుకుంటుందని… మొత్తం 15 రోజుల పాటు యాత్ర సాగుతుందన్నారు. మక్తల్ నుంచి మద్నూర్ వరకు 350 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహిస్తామన్నారు.