కాంగ్రెస్ వాళ్లంతా మునుగోడు రావాలి: రేవంత్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా మునుగోడు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను కొనాలని చూశారని.. పార్టీ కోసం నిఖార్సుగా నిలబడిన కార్యకర్తలు వారికి అమ్ముడు పోలేదని కొనియాడారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులపై ఇతర పార్టీల నాయకులు దాడులు చేస్తున్నారని.. ఎముకలు విరగ్గొడుతున్నాయని.. రానున్న వారం రోజుల్లో మరిన్ని దారుణాలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ గుండె చప్పుడు పిలుస్తోంది..
కాంగ్రెస్ శ్రేణులు ఇంట్లో తిని, ఫ్యాన్ వేసుకుని పడుకుంటే కుదరదని.. వాళ్లంతా మునుగోడు వచ్చి మన కార్యకర్తలను కాపాడుకోవాలని రేవంత్ కోరారు. ఇక్కడ ఎవరు ఏమి పెడితే అది తినాలని.. లేకుంటే నీళ్లు తాగి పస్తులుండాలని సూచించారు. అరుగుల మీద, మసీదుల్లో, గుళ్లలో.. ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకోవాలని.. మునుగోడులో మాత్రం కాంగ్రెస్‌ను గెలిపించాలని.. ఈ క్లిష్ట సమయంలో మునుగోడులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అవసరం ఉందని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘కాంగ్రెస్ గుండె చప్పుడు పిలుస్తోంది.. కార్యకర్త.. రా.. తరలి రా..!’ అని రేవంత్ పిలుపునిచ్చారు.