NationalNews

ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

న్యూఢిల్లీ, మనసర్కార్

◆ ఏఐసీసీ కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు తరలింపు
◆ 96% పోలింగ్, ఈనెల 19 కౌంటింగ్
◆ ఢిల్లీలో ఓటు వేసిన సోనియా, మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 63 పోలింగ్ కేంద్రాల్లో 9,000 మంది పైగా డెలిగేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి జరుగుతున్న ఈ ఎన్నిక ద్వారా ఆ పార్టీలో కొత్త శకం ప్రారంభమైంది. 25 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడు కానున్నారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లు అధ్యక్ష స్థానానికి పోటిపడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక విషయంలో ఇరువురి నుంచి చెప్పుకోదగిన ఫిర్యాదులు గాని ఆరోపణలు గాని లేకుండానే పోలింగ్ జరిగింది. ఈనెల 19న కౌంటింగ్ అదే రోజు ఫలితం కూడా వెలువడనుంది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం లాంటి పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కర్ణాటకలోని బళ్ళారి క్యాంపులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ అత్యంత ప్రశాంతంగా పారదర్శకంగా జరిగిందని ఎలాంటి ఫిర్యాదులు రాలేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రి తెలిపారు. మల్లికార్జున ఖర్గే గెలుపు ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నెల 19న కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్నది అధికారికంగా తేలిపోనున్నది.