కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ, తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకుని ప్రచారం సాగిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం రావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణలో కీలక స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే కర్నాటకలో భారీగా సీట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ మెరుగైన ఫలితాలు తెచ్చుకోవాలని ఆశగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఏం చేస్తామని వివరించేందుకు తెలంగాణ కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేనిఫెస్టోను శుక్రవారం 11 గంటలకు, అంటే రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లను, ఇంటర్నేషనల్ స్కూళ్లు లాంటి కీలక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయ్‌పత్ర పేరుతో దేశవ్యాప్తంగా మానిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టో ప్రకారం పేదలకు పెద్ద ఎత్తున నజరానాలను ఆ పార్టీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.