కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష షురూ…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష మంత్రాన్ని షురూ చేసింది. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, ఇతర పార్టీ పెద్దలు పోచారం ఇంటికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ నుండి కేబినెట్‌లో మంత్రులు లేరని, అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మంత్రిగా తీసుకోవాలనే నిర్ణయంతోనే కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్లు సమాచారం. పోచారం కుమారుడు భాస్కరరెడ్డి కూడా ఆయనతో పాటు కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్‌లో బలమైన కాంగ్రెస్ నేత లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో స్పీకర్‌గా, ఒకసారి మంత్రిగా కూడా పోచారం పని చేశారు. బీఆర్‌ఎస్ బలాన్ని తగ్గించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ పని చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.