కాంగ్రెస్ పార్టీ.. రైతులకు వ్యతిరేకం: మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా వచ్చే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో ప్రస్తుతం అమలులో ఉన్న రైతులకు 24 గంటల ఉచిత కరెంటును ఎత్తేస్తామన్నారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా తెలంగాణా మంత్రి జగదీష్ రెడ్డి దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలకు ఇళ్లల్లో 24 గంటలు కరెంటు ఉండాలి. కానీ తెలంగాణా రైతులకు మాత్రం వద్దా అని ప్రశ్నించారు. రైతులకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయే అన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో పార్టీ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. కాగా అప్పట్లో రైతులకు 9 గంటలు ఉచిత కరెంటు అని హామీ ఇచ్చి దానిని ఏమాత్రం నిలబెట్టుకోలేక పోయిందన్నారు. అందువల్లే అప్పుడు రైతులు ధర్నా కూడా చేశారన్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే ఏడుపు ఎందుకన్నారు. దేశంలో ప్రజలకు ఏది ఉచితంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు తెలంగాణాలో రైతు వ్యతిరేక నినాదాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందుకే సాగుకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రైతలు పట్ల దుర్మార్గపు ఆలోచనలు చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి గ్రహం వ్యక్తం చేశారు.