జమ్ము, కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్, ఎన్‌సీ కూటమి
2024 జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రారంభంలో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యత సాధించింది. ఉదయం 9.10 గంటలకు కాంగ్రెస్-ఎన్‌సీ 48 స్థానాల్లో, బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 2014 ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న నాటి నుంచి దెబ్బతింది. ఆ పార్టీ ప్రస్తుతం 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, స్వతంత్రులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 95 అసెంబ్లీ సీట్లలో ఐదు స్థానాల్లో అభ్యర్థులను నామినేట్ చేసే అవకాశమున్నప్పటికీ.. కాంగ్రెస్, ఎన్‌సీ కూటమి స్పష్టంగా విజయం సాధించేలా ఉంది. ఒకవేళ అవసరమైతే తాను మద్దతిస్తానని పీడీపీ చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చాయి.