Andhra PradeshHome Page Slider

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ గుండెపోటుతో మృతి

జలంధర్‌ కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి మృతి
రాహుల్ పాదయాత్రలో కుప్పకూలిన ఎంపీ
హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం
ఫిలింనగర్‌లో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఘటన

జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ, 76 ఏళ్ల సంతోఖ్ సింగ్ చౌదరి ఈ ఉదయం భారత్ జోడో యాత్రలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. పంజాబ్‌లోని ఫిలింనగర్‌లో పాదయాత్ర చేస్తున్న సమయంలో జలంధర్‌కు చెందిన పార్టీ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి కుప్పకూలారు. ఎంపీని అంబులెన్స్‌లో ఫగ్వారాలోని ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్లినప్పటికీ ఆయన మృతి చెందారు. ఇవాళ ఉదయం రాహుల్ పాదయాత్రలో సంతోక్ సింగ్ ఎంతో సంతోషంగా కన్పించారు. కాంగ్రెస్ ఎంపీ మరణంతో రాహుల్ గాంధీ… యాత్రను మధ్యలో ఆపేసి ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. జలంధర్‌లోని ఎంపీ నివాసానికి రాహుల్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సంతోఖ్ సింగ్ చౌదరి ఆకస్మిక మరణంతో దిగ్భ్రాంతి చెందానన్నారు రాహుల్ గాంధీ. యూత్ కాంగ్రెస్ నుండి పార్లమెంటు సభ్యుని వరకు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన అతను కష్టపడి పనిచేసే నాయకుడని కితాబిచ్చారు. ధర్మబద్ధమైన వ్యక్తి కాంగ్రెస్ కుటుంబానికి బలమైన మూలస్తంభమన్నారు. మృతుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.

చౌదరి లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. 2014, 2019లో వరుసగా ఆయన రెండు సార్లు విజయం సాధించారు. ఆయన కుమారుడు విక్రమ్‌జిత్ సింగ్ చౌదరి పంజాబ్‌లోని ఫిల్లౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. చౌదరి మరణం పార్టీకి, దేశానికి తీరని లోటన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి అకాల మరణం గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి, బాధ కలిగిందన్నారు. దుఃఖ ఘడియలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరుల హృదయం ద్రవిస్తుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు ఖర్గే.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కాంగ్రెస్ ముఖ్యనేత జైరామ్ రమేష్ కూడా సంతాపం తెలిపారు. యాత్ర ప్రస్తుతానికి నిలిపివేశామన్నారు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్. రేపు ఉదయం చౌదరి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. ఎంపీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్. ఎంపీ మరణంతో పాదయాత్రలో మార్పులు చేసినట్టు వెల్లడించారు