హిందూ పదంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ నేత
కర్నాటక కాంగ్రెస్ నాయకుడు సతీష్ జార్కిహోలీ “హిందూ” పదంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. కర్నాటక బీజేపీ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతోపాటు తాను చేసి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాడు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి రాసిన లేఖలో, తాను చేసిన ప్రకటనలపై విచారణ చేయాలన్న డిమాండ్‌పై క్షమాపణలు తెలిపాడు. కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జార్కిహోళి హిందు పదం గురించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేసింది. అయితే పార్టీ హైకమాండ్ చెప్పినప్పటికీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని జార్కిహోలీ తాజాగా తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడంతో మొత్తం వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు.

‘‘హిందూ అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది… పర్షియన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ ప్రాంతాల నుంచి వచ్చినదని… ‘హిందూ’ అనే పదానికి భారత్‌తో సంబంధం ఏంటంటూ వాదించిన జార్కిహోలీ ఇప్పుడు వెనక్కితగ్గాడు. ‘హిందూ’ అంటే ఏమిటో తెలుసుకుంటే సిగ్గుపడతారంటూ బెళగావిలో వ్యాఖ్యానించాడు. ‘హిందూ’ అనే పదానికి పర్షియన్ మూలాలన్నాయన్నాడు. ఎవరైనా తన తప్పును నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరాడు. ఐతే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న కర్నాటకలో పార్టీ కొంప ముంచుతుందని పార్టీ హైకమాండ్ రంగ ప్రవేశం చేసింది. క్షమాపణలు చెప్పకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్న హెచ్చరికల నేపథ్యంలో సతీష్ జార్కిహోలీ మెట్టుదిగినట్టు తెలుస్తోంది.

