తెలంగాణలో కాంగ్రెస్ సొంత రాజ్యాంగం అమలు చేస్తోంది
హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వెళ్లి యువతకు హామీలు ఇచ్చారని, కానీ అదే అశోక్‌నగర్‌లో ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని చూపిస్తోందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి, ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన గతేడాది బోనస్ రూ.1,150 కోట్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
“కేసీఆర్ అమలు చేసిన దళితబంధును కాంగ్రెస్ నాయకులు ఎగతాళి చేశారు. ఇప్పుడు తమ నాయకుడు ఖర్గేను తీసుకువచ్చి రూ.12 లక్షలు ఇస్తామని చెబుతున్నారు — ఇది ప్రజలను మోసం చేయడమే” అని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

