Home Page SliderTelangana

12 మంది ఎమ్మెల్యేలపై వేటుకు కాంగ్రెస్ ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి, బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన నేతలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్పీకర్‌ను డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతలపై మొయినాబాద్ పీఎస్‌లో ఆ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. పార్టీ మారిన నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు రేవంత్ రెడ్డి. నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చినా, కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి, రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు.

గతంలో రూల్స్ పక్కనబెట్టి తలసానికి మంత్రి పదవి ఇచ్చినట్టే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డికి పదవి కట్టబెట్టారన్నారు. 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలది విలీనప్రక్రియ అని ప్రకటించడం చట్ట వ్యతిరేకమన్నారు. తాము ఎన్నిసార్లు కంప్లైట్ చేసినా… స్పీకర్ పెడచెవిన పెట్టారన్నారు. కేసీఆర్ సబిత ఇంద్రారెడ్డికి మంత్రి పదవి, రేగా కాంతారావుకు విప్ పదవి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మూసీ రివర్ డెవల్మెంట్ ఛైర్మన్ పోస్టు ఇచ్చారని, మిగతా 9 మందికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించారని ఆరోపించారు. ఏసీబీ నియమనిబంధనల ప్రకారం నేరానికి పాల్పడ్డా, లంచం తీసుకున్నా చట్ట రీత్యా శిక్షార్హులవుతారన్నారు. నేర ప్రవృత్తికి అలవాటుపడిన పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచి నాడు టీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరతారని రేవంత్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే బలరాజుతో సహా, నలుగురు బీజేపీకి అమ్ముడుపోడానికి సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మెయినా‌బాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని… లంచం ఇవ్వజూపినా, తీసుకుబోయినా నేరమే… దీనిపై విచారించాలన్నారు. పైలట్‌పై ఫిర్యాదు చేయడానికి ఇవాళ మెయిన్‌బాద్ స్టేషన్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మల్లు రవి, సీనియర్ నేతలు వచ్చారు.