కాంగ్రెస్ మాటిచ్చి, మోసం చేసింది, ఒంటరి పోరాటానికి సీపీఎం నిర్ణయం
ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ పోటీకి బ్రేకులు పడినట్టు కనిపిస్తోంది. రెండు పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా సీట్ల పంపకాల దగ్గర తేడాలొచ్చాయ్. సీపీఎం, సీపీఐకి చెరి రెండేసి సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ససేమిరా అనడంతో తాము సొంతంగా ఎన్నికల బరిలో దిగతున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కాంగ్రెస్ మాట మార్చిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తోందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తమకు కేవలం మిర్యాలగూడ సీటు మాత్రమే ఇస్తానంటోందని, వైరా కూడా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశామని.. వారి నుంచి సానుకూలత లేకపోవడంతో ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయించినట్టు సీపీఎం పేర్కొంది. సీపీఐతో కూడా దాదాపు సీపీఎం పొత్తు లేనట్టుగా భావించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ) ఏడు సీట్లలో పార్టీ చేస్తోంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6 నియోజకవర్గాలు, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్ (ఎస్సీ), భువనగిరి, హుజూర్ నగర్, కోదాడలతోపాటుగా జనగం, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని పార్టీ ప్రకటన విడుదల చేసింది. అయితే సీపీఐతో కాంగ్రెస్ పొత్తు వ్యవహారం కొలిక్కి రావాల్సి ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీటును సీపీఐకి ఖరారు చేసేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. ఐతే సీపీఎం పార్టీకి మిర్యాలగూడ మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపింది. దీంతో పొత్తుకు ఆ పార్టీ ససేమిరా అంది. సీపీఎం పోటీ చేయబోతున్న స్థానాలివే…!


