తనకు ప్రజలు రెండు కళ్లు అన్న కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్క
మంగపేట: గిరిజనులు, గిరిజనేతరులు తనకు రెండు కళ్లు అని ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయండి. మీ అందరికీ అండగా ఉంటానన్నారు. గురువారం మంగపేట మండలంలోని రాజుపేట, వాగొడ్డుగూడెం, లక్ష్మీనర్సాపూర్, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, పెరుకలకుంట, బండారుగూడెం ఇంకా చుట్టు పక్కల అనేక గ్రామాల్లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మాజీ సొసైటీ ఛైర్మన్ వల్లిపల్లి శివయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీతక్కకు మహిళలు హారతులు పట్టి, పూల మాలలతో స్వాగతం పలికారు. ప్రచారంలో సీతక్క మాట్లాడారు. కత్తిగూడెం ఎత్తిపోతల పథకాలు మరమ్మతుకు గురైతే నేటివరకు వాటిని పునరుద్ధరించలేదని విమర్శించారు. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

