“కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ఒకేతాను ముక్కలు”… కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
‘బీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణ రాలేదు.. కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలన రాలేదు’..అంటూ గత ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ‘కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ఒకేతాను ముక్కలు’ అని వ్యాఖ్యానించారు. క్లాసిక్ గార్డెన్ లో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మేలుకోసమే పాలన చేశారు, తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితులు మారలేదు. సుమారు 400 పైచిలుకు హామీలు, 6 గ్యారంటీల పేరుతో మభ్యపెట్టింది. ప్రజలు నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల పట్ల విసిగివేసారిపోయారు.
గత ఎన్నికల్లో సుమారు 77 లక్షల మంది ప్రజలు బిజెపి కి అనుకూలంగా మద్దతు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు తెచ్చుకుంది. భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్వించదగినది.
దేశ వ్యాప్తంగా సభ్యత్వ సేకరణ కార్యక్రమం అక్టోబరులో ప్రారంభమవుతుంది. ఈసారి తెలంగాణలో రైతులు, మహిళలు, యువత ప్రధాన లక్ష్యంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగడానికి బిజెపి సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని మలుచుకుని ముందుకెళ్తాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తారు.
జమ్ము కశ్మీర్ లో 2014కు ముందు పరిస్థితులు దారుణంగా ఉండేవి. ఆర్టికల్ 370 ని రద్దు చేసి జిన్నా రాజ్యాంగం తీసేసి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అమలు చేశాం. నేడు మహిళలకు ఆస్తి హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలతో పాటు, రిజర్వేషన్ల అమలు, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలతో జమ్ము కశ్మీర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది. దేశ వ్యతిరేక శక్తులతో కలిసి కాంగ్రెస్ నాయకులు వ్యవహారం నడుపుతోంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు”. అని పేర్కొన్నారు.

