సెంటిమెంట్‌నే నమ్ముకున్న కాంగ్రెస్
మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు మునుగోడు నియోజక వర్గంలోనే తిష్టవెసి ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. గెలుపు కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. గడపగడకు కాంగ్రెస్ పేరిట.. నియోజకవర్గంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు కుంకుమ, గాజులు పెట్టి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్న స్రవంతి ఇంటింటికీ తిరుగుతూ తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. నిన్న నామినేషన్ దాఖలు చేసిన పాల్వాయి స్రవంతి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఓటర్లలో సెంటిమెంట్ తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఆడబిడ్డను వచ్చాను.. ఒకసారి నన్ను గుర్తుంచుకోండి అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పాల్వాయి స్రవంతి కంటతడి పెట్టుకుని తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. నాన్నలేని లోటు నాకు ఈరోజు తెలుస్తుంది అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇక్కడ ఉన్న మీరందరూ నా తోబుట్టువులై, నా తండ్రి స్థానం తీసుకొని, నాతో పాటు నడవాలని, నా చేతులు చాచి, నా కొంగు పట్టి ప్రాధేయ పడుతున్నాను అంటూ పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు.