NewsTelangana

ఇంజనీరింగ్‌ అడ్మిషన్లపై గందరగోళం

రెండో దశ కౌన్సెలింగ్‌ అక్టోబరు 11కు వాయిదా

వచ్చే నెల 25లోపు బీ-కేటగిరీ సీట్ల భర్తీ

16న కన్వీనర్‌ కోటాలో రెండో విడత సీట్లు

ఆలోపే బి-కేటగిరి సీట్ల భర్తీకి కాలేజీల ప్లాన్‌

ఫీజులపై లేని స్పష్టత.. ఎంత వసూలు చేస్తారో..?

తెలంగాణాలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్లపై గందరగోళం నెలకొంది. కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీని పూర్తి చేయకముందే మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీకి ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది. కన్వీనర్‌ కోటాలో మొదటి విడత సీట్లు మాత్రమే భర్తీ చేశారు. రెండో విడత సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ అక్టోబరు 11వ తేదీకి వాయిదా పడింది. ఫీజుల విషయం తేలకపోవడం వల్లే కౌన్సెలింగ్‌ను వాయిదా వేశామని అధికారులు తెలిపారు. కన్వీనర్‌ కోటాలో రెండో విడత సీట్ల కేటాయింపును అక్టోబరు 16వ తేదీన ప్రకటిస్తారు.

అక్టోబరు మొదటి వారంలోనే బి-కేటగిరీ సీట్ల భర్తీ..

అయితే.. కౌన్సెలింగ్‌ పూర్తి కాకముందే బి-కేటగిరీలో సీట్ల భర్తీకి టెక్నికల్‌ బోర్డు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 25వ తేదీలోపు భర్తీ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించినా.. రెండో విడత సీట్ల కేటాయింపు జరిపే అక్టోబరు 16వ తేదీ నాటికే దాదాపు అన్ని కాలేజీలు మేనేజ్‌మెంట్‌ కోటాలో (బి-కేటగిరి) సీట్ల భర్తీని పూర్తి చేస్తాయి. చాలా కాలేజీలు అక్టోబరు మొదటి వారంలోనే మేనేజ్‌మెంట్‌ సీట్లను భర్తీ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. జేఈఈ మెయిన్‌, ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒక్కో కాలేజీకి ఒక్కో సమయంలో సీట్లను భర్తీ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఆయా కాలేజీలు వేర్వేరుగా ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి.

మెరిట్‌ విద్యార్థులు నష్టపోతారు..

విద్యార్థులు సాధారణంగా రెండో దశ కౌన్సెలింగ్‌ వరకూ వేచి చూస్తారు. అలా చేస్తే మెరిట్‌ విద్యార్థులకు కన్వీనర్‌ కోటాలోనే నచ్చిన సీటు పొందే వెసులుబాటు లభిస్తుంది. అప్పటికీ కన్వీనర్‌ కోటాలో నచ్చిన కాలేజీలో నచ్చిన సీటు లభించని విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ సీటు కోసం ప్రయత్నిస్తారు. బి-కేటగిరీలో సీట్ల భర్తీపై ప్రభుత్వం తొందర పడటంతో మెరిట్‌ విద్యార్థులు నష్టపోతారని విద్యావేత్తలు అంటున్నారు. అధికారుల చర్యలు సీట్లను భారీ ఫీజులకు అమ్ముకోవడానికి కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బి-కేటగిరీలో ఎంత ఫీజు తీసుకుంటారు..

మరోవైపు.. ఇంజనీరింగ్‌ ఫీజులపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఫీజులు ఖరారు చేయకపోవడంతో మేనేజ్‌మెంట్‌ సీట్లకు ఎంత ఫీజు వసూలు చేస్తారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కన్వీనర్‌ కోటాలో సీట్లు కేటాయించిన కాలేజీల్లో చెల్లించాల్సిన ఫీజును ఎంసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థికి తెలుపుతారు. పైగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్థి చెల్లించిన ఫీజు ప్రభుత్వం వద్దే ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ కోటా సీటు అయితే.. ఆయా కాలేజీలే నేరుగా వసూలు చేస్తాయి. నిజానికి.. బి-కేటగిరీలో భర్తీ చేసే మేనేజ్‌మెంట్‌ కోటా సీటుకు కూడా కన్వీనర్‌ కోటా ఫీజే వసూలు చేయాలి. కానీ.. చాలా కాలేజీలు ఆ నియమాన్ని పాటించడం లేదు. ఎక్కువ ఫీజు ఇచ్చిన వారికే బి-కేటగిరీ సీటు కేటాయిస్తున్నాయి. రికార్డుల్లో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేసినట్లు చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా ఫీజును నిర్ణయించకపోవడంతో బి-కేటగిరీ సీట్లలో కాలేజీలు ఎంత ఎక్కువ ఫీజులు వసూలు చేస్తాయోనని విద్యార్థులు భయపడుతున్నారు.