లోక్‌సభలో గందరగోళం.. 30 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్
పార్లమెంట్‌లో స్మోక్ బాంబ్ వ్యవహారంపై వేడి ఇంకా చల్లారలేదు. భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ విపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. గందరగోళం సృష్టించడంతో ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ 30 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓంబిర్లా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గురువారం 13 సభ్యుల సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో సహా 33 మందిని సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరంతా నిరసనలతో సభా కార్యక్రమాలు జరగకుండా ఆటంకం కలిగిస్తున్నారని, సభామర్యాద పాటించకుండా సభాపతి ఆదేశాలు ధిక్కరించారని ఆరోపణలు చేయబడ్డాయి. వీరిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సస్పెన్షన్ తీర్మానాన్ని పెట్టగా, మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తూ, తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీనితో ఈ అంశంపై ఇప్పటి వరకూ 46 మందిని లోక్‌సభ నుండి, రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్‌ను శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు. దీనితో లోక్ సభ, రాజ్యసభలలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. సభ రేపటికి వాయిదా పడింది.

