నన్ను తిట్టేందుకు కాంగ్రెస్‌లో పోటీ
“నన్ను తిట్టేందుకు కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు” అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కలోల్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తనను ‘రావణుడు’ అని అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను మోదీ ఖండించారు. ‘రామభక్తులు’ ఉన్న గడ్డపై ఎవరినైనా ‘రావణుడు’ అనడం భావ్యం కాదన్నారు. “మోదీ కుక్క చావు చస్తారని ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే.. మోదీ హిట్లర్‌లా చస్తాడని మరో నాయకుడు విమర్శించాడు. నాకు అవకాశం ఇస్తే మోదీని చంపేస్తానని ఇంకొక నాయకుడు అన్నాడు. ఒకరు రావణుడు అంటే.. మరొకరు రాక్షసుడు అన్నాడు. ఇంకొకరు బొద్దింక అని విమర్శిస్తున్నారు. ఇంత ఘోరంగా మాట్లాడిన కాంగ్రెస్ వాళ్లు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మోదీని, దేశ ప్రధానిని విమర్శించడం తమ హక్కు అని కాంగ్రెస్ వాళ్లు భావిస్తున్నారు” అని మోదీ ఘాటుగా ఎదురు దాడి చేశారు.

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. “దేశ ప్రధానిగా మోదీ తన పని పక్కన పెట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లొచ్చినా.. ఎమ్మెల్యే ఎన్నికలొచ్చినా.. ఎంపీ ఎన్నికలొచ్చినా.. ప్రతి ఎన్నికలోనూ తనను చూసే ఓటేయాలని మోదీ అడుగుతారు. అన్ని చోట్లా ఆయనే పాలిస్తారా..? ఆయనకేమైనా రావణాసురిడికి ఉన్నట్లు వంద తలలు ఉన్నాయా..?” అని విరుచుకుపడ్డారు. మోదీకి ఆయన స్థాయి ఏంటో చూపిస్తానని మరో కాంగ్రెస్ నేత మధుసూధన్ మిశ్రీ విమర్శించారు.