News AlertPoliticsTelanganatelangana,

రోడ్లు బాగుంటేనే కంపెనీలు వస్తాయి:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధిలో రోడ్ల ప్రాధాన్యం ఎంతగానో ఉందని, రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉంటేనే రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించగలమని రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నాక్ ఆడిటోరియంలో ‘హ్యమ్ ప్రాజెక్ట్ రోడ్ల’పై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హ్యామ్ ప్రాజెక్ట్ విజన్ డాక్యుమెంట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్టీలకు అతీతంగా రాష్ట్రాలకు రోడ్ల కేటాయింపులో సహకరిస్తున్నారని అభినందించారు. కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఫారెస్ట్ అనుమతుల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని గడ్కరీ సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే హై స్పీడ్ ట్రైన్స్, గ్రీన్ ఫీల్డ్ హైవే వంటి పెద్ద ప్రాజెక్టులు ఇప్పటికే అప్రూవల్ దశలో ఉన్నాయని, వీటిని త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి రోడ్ల పనులు వెంటనే ప్రారంభించి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారని వివరించారు.