Home Page SliderNational

మణిపూర్‌‌లో కలకలం..సోదాల్లో లభ్యమైన అత్యాధునిక మారణాయుధాలు ..

మణిపూర్‌లో మయన్మార్ నుండి కుకీ మిలిటెంట్లు చొరబడ్డారన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధునాతన మారణాయుధాలు దొరకడం సంచలనం రేపుతోంది. చురాచాంద్‌పుర్ జిల్లాలోని సములామ్లన్‌లో పోలీసులు శుక్రవారం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో రకరకాల మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనితో దేశ భద్రత విషయంలో ఆందోళన నెలకొంది. ఇంప్రూవైజ్డ్ రాకెట్ షెల్, రకరకాల సైజుల్లోని మూడు లైవ్ రాకెట్ హెడ్ అమ్యూనిషన్, 3 ఇంప్రూవైజ్డ్ మోర్టార్లు, యాంటీ రిమోట్ స్టన్ షెల్స్, స్టన్ గ్రెనేడ్ వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుండి 900 మంది మిలిటెంట్లు చొరబడ్డారన్న సమాచారం మణిపూర్ వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. పైగా మారణాయుధాలు దొరకడంతో బెంబేలెత్తుతున్నారు. ఈ మిలిటెంట్లు జంగిల్ వార్‌ఫేర్, డ్రోన్ బాంబులు, ప్రొజెక్టైల్స్, మిస్సైళ్ల వాడకంలో శిక్షణ పొందారని ఐబీ అలర్ట్ వచ్చిందని మణిపూర్ సెక్యూరిటీ అడ్వైజర్ కులదీప్ సింగ్ పేర్కొన్నారు. వీరంతా ఈ నెలలో మైతీ గ్రామాలపై దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పైగా వీరు 30 టీములుగా విడిపోయి పనిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇది నిజమో, కాదో తేలేవరకూ దీన్ని రూమర్స్‌గా కొట్టి పారేయలేమని, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. గతంలో మణిపూర్ అంతర్గత అల్లర్లు, మహిళలపై అత్యాచారాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనితో భద్రత విషయంలో రాజీపడేది లేదని ఆయన పేర్కొన్నారు.